కుమార్తెల పెళ్లిళ్లు, రాజకీయాలపై నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- శివాని, శివాత్మికలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయన్న రాజశేఖర్
- ప్రస్తుతం వారి దృష్టి సినిమాలపైనే ఉందని వెల్లడి
- రాజకీయాల్లో ఉన్నప్పుడు తాము సొంత డబ్బునే ఖర్చు చేశామన్న రాజశేఖర్
- విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని వ్యాఖ్య
టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన వ్యక్తిగత జీవితం, కుమార్తెల కెరీర్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
కుమార్తెలు శివాని, శివాత్మికలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, అయితే వారు ప్రస్తుతం సినిమాల్లోనే రాణించాలని భావిస్తున్నారని రాజశేఖర్ తెలిపారు. వారి ఇష్టానికి తాము అడ్డుచెప్పబోమని, అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
తాము రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బునే ఖర్చు చేశామని, ఎవరిపైనా ఆధారపడలేదని తెలిపారు. తన భార్య జీవితకు ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన వెల్లడించారు. తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు విజయావకాశాలు ఉన్నాయని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.
చాలా కాలం తర్వాత రాజశేఖర్ 'బైకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్‌కు తండ్రిగా ఆయన చేసిన నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.